నిజానికి ఇద్దరూ చేసింది ఒప్పే !

హైదరాబాదు పాతబస్తీకి చెందిన విశ్వనాథ్ ఒక స్వయంసేవక్. రకరకాల బాధ్యతల్లో పనిచేశారు. యోగా లో మంచి ప్రవేశం, నైపుణ్యం ఉండటంతో ఆయన యోగా విశ్వనాథ్ గా సంఘంలో పరిచితులు. ఆయనకు హంపి విద్యారణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతి స్వామీజీతో సన్నిహిత సంబంధం.దాంతో స్వామీజీ ఈయనను తమ ఉత్తరాధికారిగా గుర్తించి సన్యాసదీక్ష ఇచ్చారు. స్వయంసేవక్ గా ఉన్నపుడు తరచుగా బర్కత్ పురా లోని సంఘ కార్యాలయం కేశవ నిలయానికి వచ్చి సంఘ అధికారులను కలుస్తుండేవారు విశ్వనాథ్ గారు. సన్యాసదీక్ష తీసుకుని హంపి విద్యారణ్యపీఠానికి ఉత్తరాధికారి అయిన తర్వాత బహుశా మొదటిసారి అనుకుంటాను. ఆయన కార్యాలయానికి వచ్చిన రోజుననే, అప్పటికి సంఘ సర్ కార్యవాహ గా ఉన్న మాననీయ శ్రీ హొ.వె. శేషాద్రి జీ కూడా వచ్చారు. స్వామీజీని చూడగానే మాననీయ శేషాద్రి జీ ,స్వామీజీకి సాష్టాంగ ప్రణామం చేశారు. 
    మాననీయ శ్రీ శేషాద్రిజీ స్వయంసేవక్ గా బాగా పరిచయమున్న విశ్వనాథ్ గా ఆయనను భావించలేదు. ఒక గొప్ప పీఠానికి పీఠాధిపతిగానే ఆయనను చూశారు, సాష్టాంగ ప్రణామం చేశారు. అలాగే ఎన్నోసార్లు మాననీయ సర్ కార్యవాహగారికి తనే ముందుగా నమస్కరించే అలవాటున్న స్వయంసేవక్ , తామిపుడు ఒక గొప్ప పీఠానికి పీఠాధిపతి, సన్యాసి అవడంతో ఆయనను ఒక హిందూ భక్తుడిగానే భావించి ఆశీర్వదించారు. 
   ఇదంతా చూస్తున్న కార్యాలయంలో ఆనాడున్న  ప్రచారకులు చాలామంది , ఇదేమిటి శ్రీ శేషాద్రి జీతో కాళ్ళకు మ్రొక్కించుకుంటున్నాడు అనుకున్నారు కూడా. అయితే అటు శ్రీ శేషాద్రి జీ ఇటు స్వామీజీ మాత్రం ఇదంతా మామూలు విషయం అన్నట్లుగానే ప్రవర్తించారు. 
      వయస్సు దృష్ట్యా స్వామీజీ చిన్నవారు, మాననీయ శ్రీ శేషాద్రి జీ పెద్దవారే !
    నిజానికి ఇద్దరూ చేసింది ఒప్పే ! 

      మీరేమంటారు?

Post a Comment

0 Comments