ఉడుపిలో బాలకృష్ణుడి దేవాలయం చాలా ప్రఖ్యాతి గాంచినది.తమ గీతా జ్ఞాన యజ్ఞాల ద్వారా ప్రఖ్యాతి గాంచిన స్వామి చిన్మయానంద ఒకసారి ఉడుపి వెళ్ళారు. దేవాలయాన్ని సందర్శించాలనుకున్నారు స్వామి చిన్మయానందులు. ఆ సమయంలో పర్యాయ పెజావర మఠాధీశులది. కాబట్టి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీకి కబురు పెట్టారు. అప్పటికి శ్రీ విశ్వేశతీర్థులు కొత్తగా పీఠాధిపతి గా బాధ్యత స్వీకరించి ఉన్నారు. విషయం తెలియగానే దేవాలయ ముఖద్వారం వద్ద స్వామి చిన్మయానందులను స్వాగతించడానికి నిలబడ్డారు విశ్వేశతీర్థులు. దేవాలయం దగ్గరికి కారు వచ్చి ఆగిన తర్వాత ,అందులోనుండి దిగిన స్వామి చిన్మయానందులు నేరుగా స్వామి విశ్వేశతీర్థుల దగ్గరకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించారు. అది చూసిన వారిరువురి శిష్యులు ఆశ్చర్యపోయారు. దర్శనానంతరం స్వామి చిన్మయానందులు వసతికి వచ్చేశారు. ఒక శిష్యుడు ఆయనతో, అదేమిటి మీకన్నా చిన్నవారైన పెజావర స్వామీజీకి పాదాభివందనం చేశారే? అని ప్రశ్నించాడు. అందుకు స్వామి చిన్మయానందులు, నేను శ్రీ విశ్వేశతీర్థులలో ఉడుపి బాలకృష్ణుడిని దర్శించాను. అందుకే పాదాభివందనం చేశాను అని జవాబిచ్చారు.
0 Comments