డాక్టర్జీ తప్పుచేసిన వారిని దండించారా?.... - bruyat



డాక్టర్జీ తప్పుచేసిన వారిని దండించారా?....

ఒక వ్యక్తి యేదైనా పొరపాటు చేస్తే అతనిని దూషించినంత మాత్రాన పరివర్తనరాదు. దూషించబడిన ఆ వ్యక్తి శాశ్వతంగా మన నుండి దూరమౌతాడు. అటువంటి వ్యక్తిని సరియైన దారికి తీసుకురావడానికి డాక్టర్ జీ అనుసరించిన విధానం ఉదాహరణగా కనిపిస్తుంది.
నాగపూర్ నుండి వెలువడే 'స్వాతంత్ర్య' అను వార పత్రికకు డాక్టర్ జీ సంపాదకులుగా వుండేవారు. ఒకనాడు ఆపత్రిక సహసంపాదకులు కడుపునొప్పిగా నుండుటవల్ల ఆఫీసుకు రాలేనని శలవు చీటి పంపించారు. డాక్టర్ జీ ఆఫీసుకురాగానే ఆ ఉత్తరం చూచి సుస్తీగా వున్న సహ సంపాదకుని చూద్దామనే తలంపుతో వారింటికి వెళ్లారు. సహ సంపాదకులు యింట లేరు. ఆయన భార్యకు, తనభర్త శలవు చీటీ విషయం తెలియదు ఆమె డాక్టర్ జీ తో - "ఒక స్నేహితుని యింట విందుకై వెళ్లార''ని చెప్పింది. అది విని డాక్టర్ జీ ఆశ్చర్యపడ్డారు. అచటి నుండి డాక్టర్ జీ ఆ స్నేహితుని యింటికి వెళ్లారు. ఆ మిత్రుని యింట సహ సంపాదకులు తన స్నేహితులతో బాతాఖానీ కొడుతున్నారు. వారు డాక్టర్ జీ ని చూడగానే నిర్ఘాంతపోయారు. కాని డాక్టర్ జీ వారి శలవుచీటీ ప్రస్తావన తీసుకురాలేదు. అవసరమైన విషయాలు మాట్లాడి వెళ్ళిపోయారు. పాపం ఆ సహసంపాదకులు "అప్పటి నుండి ఎప్పుడూ ఇటువంటి పొరపాటు పని చేయకూడద"ని నిశ్చయించుకున్నారు. అలా తన ప్రవర్తన ద్వారా మార్చేవారు... --రాష్ట్రశక్తి నుండి.

Post a Comment

0 Comments