సమయాభావమెక్కడుంది ?
1962-63 నాటి విషయం. పండత దీనదయాళ్ ఉపాధ్యాయ విచారదర్శన్ పేరుతో పుస్తకాలు ప్రచురించాలని నిర్ణయం జరిగింది. ఈ ప్రకల్పానికి శ్రీ దత్తోపంత్ జీ మార్గదర్శకులు. అందులో భాగంగా ' పండిత దీనదయాళ్ జీ జాతీయవాద ఆలోచనలు ' అనే భాగాన్ని సంకలనం చేసే బాధ్యత శ్రీ చంద్రశేఖర పరమానంద భిశీకర్ ( చం.ప.భిశీకర్ ) కు అప్పగించడం జరిగింది. ఆయన 200 పుటలతో విషయాన్ని పూర్తిచేశారు. అనుకోకుండా శ్రీ ఠేంగ్డేజీ పుణె కు రావడంతో, తను సంకలనం చేసిన వ్రాతప్రతిని ఆయనకు చూపించాలనుకున్నారు శ్రీ భిశీకర్. ఆయనను కలిసి, విషయం చెప్పి, వ్రాతప్రతిని సరిచూసేందుకు సమయముందా ? అనడిగారు. 200 పుటలను చూడాలంటే చాలా సమయం పట్టవచ్చు అన్న ఆలోచనతో ఆయన అలా అడిగారు. ఆ ప్రశ్న విన్న శ్రీ ఠేంగ్డేజీ , సమయభావమొక్కడుంది ? రోజూ పగటివేళ రకరకాల కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా, రాత్రి అనేది మనదే కదా ! ఈ రోజు రాత్రి 11 గంటలకు రండి. మీ పని పూర్తిచేద్దాం అన్నారు. శ్రీ భిశీకర్ సరిగ్గా 11 గంటలకు వారు విడిది చేసిన కార్యకర్త ఇంటికి వెళ్ళారు. ఆయన చదువుతుంటే శ్రీ ఠేంగ్డేజీ వింటూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూపోయారు. అలా 200 పుటలు చదవడం పూర్తయ్యేసరికి తెల్లవారుజామున 5 గంటలైంది.రోజంతా రకరకాల కార్యక్రమాలలో పాల్గొని, రాత్రంతా నిద్రలేకపోయినా , శ్రీ ఠేంగ్డేజీలో అలసట అన్నది కన్పించలేదు.
0 Comments