సారవంతమైన లక్షలాది ఎకరాల్లో వాణిజ్యపంటలు పండిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌ల సంగతి చూడండి. గోధుమ వరి పండించ వలసిన మంచి భూముల్లో చెరకు పండిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు గోధుమను విరివిగా ఎగుమతి చేసే ఉత్తరప్రదేశ్ నేడు పంజాబ్ మొదలైన ప్రాంతాల నుంచి గోధుమ దిగుమతి చేసుకోవలసి వస్తోంది. మహారాష్ట్రలో ద్రాక్షతోటలు పెంచటంలో (ముఖ్యంగా సారా తయారీ కోసం) పోటీ ఏర్పడింది. ఆంధ్రలో పొగాకు పంటను ప్రోత్సహించేందుకు పొగాకు అభివృద్ధి శాఖ ఒకటి ఏర్పాటయింది. వేరుసెనగ కూడా ఇట్లాంటిదే. ఈ ధోరణిని అరికట్టి ఆయా భూములను ఆహారధాన్యం ఉత్పత్తికి మళ్లీ వినియోగించాలి. మనం దిగుమతే చేసుకోవలసి వస్తే, గోధుమకు బదులు పంచదారనే దిగుమతి చేసుకుందాం. ఈనాటివలె అత్యయిక పరిస్థితి ఏర్పడినప్పుడు పంచదార దిగుమతి ఆగిపోయినా పర్వాలేదు. పంచదార లేకపోతే చచ్చిపోం. బియ్యం, గోధుమల కొఱత ఏర్పడితే మాత్రం బ్రతకలేం. పి.యల్.480 కింద అమెరికా నుండి గోధుమల దిగుమతి కొరకు మన నాయకులు ఎట్లా పరుగులు పెడుతున్నారో మనకు తెలుసు.
0 Comments