భారత్లో రాజకీయాలు

9. పార్టీ రాజకీయాలు 59. భారత్లో రాజకీయాలు: భారతీయ రాజకీయాలను ఈదేశపు సంస్కృతి, జీవనతత్త్వాల నుండి విడదీసి ఆలోచించలేము. భారతీయ సంస్కృతి ఏకాత్మకమైనది. ప్రపంచంలోని వివిధ భాగాలలోను, జీవితంలోని వివిధ అంశాలలోను పైనకనిపించే తేడాలను, అంగీకరించినప్పటికీ అది వాటిలోని అంతర్గత ఏకతను కనుగొని వాటిని సమన్వయపరుస్తుంది. సోషలిజం, ప్రజాస్వామ్యం రెండు వర్గ సంఘర్షణ ఫలితంగా వచ్చేవే. ఈ సంఘర్షణను అంతంచేసి ఐక్యతను నెలకొల్పటమే ఈ రెండింటి ఆశయం అయినప్పటికీ ఇందుకుగాను అవి స్వీకరించిన పద్ధతి ఈవర్గాల రూపాలను మార్చిందేతప్ప వాటిని అంతం చేయలేదు. కనుక ఈ ఘర్పణ మరింత తీవ్రమైంది. రాజుకు, ప్రజలకు మధ్య ఘర్షణ శాశ్వతమని ప్రజాస్వామ్యం భావించింది. కనుక అది రాజును అంతం చేసింది. అయితే ప్రజాస్వామ్యం విభిన్న ప్రజావర్గాల మధ్య సంఘర్షణను శాశ్వతంగా ఆమోదించింది. సోషలిజమేమో ఉన్నవారికీ, లేనివారికీ మధ్య సంఘర్షణను తన ప్రాతిపదికగా చేసుకుంది. వర్గాలు మారాయే తప్ప సంఘర్షణ అంతం కాలేదు. కారణం పాశ్చాత్య ఆలోచనా వ్యవస్థలన్నీ డార్విన్ ప్రతిపాదించిన 'నెగ్గిన వాడిదే బతుకు'(Survival of the fittest) సిద్దాంతం నుంచి పుట్టుకొచ్చినవే.
ప్రపంచం సంఘర్షణవల్లగాక సమన్వయం, సహకారాల వల్లనే నడుస్తున్నది. ప్రపంచం సృష్టించబడి, కొనసాగు తుండటానికి కారణం పురుషుడికీ, ప్రకృతికీ మధ్య ఘర్షణకాదు; వాటి అన్యోన్యాశ్రయం(interdependence)
మాత్రమే. కనుక వర్గసంఘర్షణ, వర్గశత్రుత్వాల ప్రాతిపదికనగాక పరస్పర ఆధారత (అన్యోన్యాశ్రయం), పరిపూరకత్వం, పరస్పర సహకార ప్రాతిపదిక మీదనే అన్ని చర్యలను చర్చించి, విశ్లేషించాలి.

Post a Comment

0 Comments