సెక్యులర్ రాజ్యం

58. సెక్యులర్ రాజ్యం: ఈరోజుల్లో మత రాజ్యానికి వ్యతిరేకమైనదిగా “సెక్యులర్ రాజ్యం” అనే పదబంధాన్ని వాడుతున్నారు. ఈమాటను స్వీకరించడమంటే విదేశీ ఆలోచనా విధానాన్ని అనుకరించడం మాత్రమే అవుతుంది. దీనిని దిగుమతి చేసుకోవలసిన అవసరం మనకులేదు. పాకిస్తాన్ తో తేడాను చూపించడానికి దీనిని సెక్యులర్ రాజ్యం అన్నాం. దీనివల్ల ఒక అపోహ ఏర్పడుతున్నది. మతాన్ని, ధర్మాన్ని ఒకటిగా భావించి సెక్యులర్ రాజ్యమంటే ధర్మరహిత రాజ్యంగా భావిస్తున్నారు. కొందరు దీనిని ధర్మరహిత రాజ్యం అంటే మరికొందరు ఇంకాస్త మంచిపదం వెదకడానికి ప్రయత్నిస్తూ దీనిని ధర్మనిరపేక్ష రాజ్యం అన్నారు. కాని ఈ పదాలన్నీ మౌలికంగా తప్పుడు పదాలే. వేడిలేని నిప్పు వుండనట్లే ఒక రాజ్యం ధర్మరహితంగాగాని, ధర్మనిరపేక్షంగా గాని వుండజాలదు. నిప్పు వేడిని కోల్పోతే అది యింకెంత మాత్రం నిప్పుగా వుండదు. మౌలికంగా ధర్మాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించడానికే వుండే రాజ్యం ధర్మ రహితంగానో, ధర్మనిరపేక్షంగానో వుండలేదు. అది ధర్మరహిత రాజ్యమే అయితే అవ్యవస్థగల (lawless) రాజ్యమవుతుంది. అవ్యవస్థ వుండే చోట ఏరాజ్యం మాత్రం వుండే ప్రశ్న ఎక్కడిది? మరోవిధంగా చెప్పాలంటే ధర్మనిరపేక్ష భావన, రాజ్యభావన అనేవి రెండూ పరస్పర విరుద్ధమైనవి. రాజ్యమంటే ధర్మపాలనగానే వుండగలదు తప్ప మరొకటి కాజాలదు. మరేవిధమైన నిర్వచనమైనా దాని అస్తిత్వ హేతువుతోనే ఘర్షిస్తుంది.

Post a Comment

0 Comments