ఆహారహక్కు

35. ఆహారహక్కు “ఎవడిరొట్టె వాడు సంపాదించుకోవాలి” అనేది ఈరోజుల్లో సాధారణంగా వినిపిస్తున్న నినాదం. మామూలుగా ఈ నినాదాన్ని కమ్యూనిస్టులు వాడుతుంటారు. అయితే క్యాపిటలిస్టులు కూడా మౌలికంగా దీనితో విభేదించటంలేదు. వారిమధ్య ఏదైనా తేడావుంటే అది ఎవరు సంపాదిస్తారు, ఎంత సంపాదిస్తారు అనే విషయంలో మాత్రమే. క్యాపిటలిస్టులు పెట్టుబడి, వాణిజ్యవ్యవస్థ ఉత్పాదనకు ప్రధాన కారకాలుగా పరిగణిస్తారు. లాభంలో వారు సింహభాగాన్ని తీసుకుంటారంటే అది తమకు న్యాయంగా రావలసినదేనని వారు భావిస్తారు కనుకనే. కాగా కమ్యూనిస్టులేమో ఉత్పాదనలో శ్రామికులు మాత్రమే ప్రధానకారకమని నమ్ముతారు. అందువల్ల వారు ఉత్పాదనలో సింహభాగాన్ని శ్రామికులకే ఇవ్వాలంటారు. ఈ రెండుభావనల్లో ఏదీ సరియైనదికాదు. కచ్చితంగా చెప్పాలంటే సంపాదించేవాడు ఇతరులకు పెడతాడు, ప్రతిమనిషికీ తినడానికి తగినంతవుంటుంది” అనేదే మన నినాదంగా వుండాలి. ఆహార హక్కు ఒక జన్మహక్కు సంపాదించే సమర్థత విద్యవల్లను, శిక్షణవల్లను, లభిస్తుంది. ఒక సమాజంలో సంపాదించని వారికి కూడా ఆహారం  లభించాల్సిందే. చిన్నపిల్లలను, వృద్ధులను, వ్యాధిగ్రస్తులను, దుర్బలులను అందరినీ సమాజం ఆదుకోవాలి. సాధారణంగా ప్రతి సమాజమూ ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఈ బాధ్యతను నిర్వర్తించే సంసిద్ధతలోనే మానవజాతియొక్క సామాజిక, సాంస్కృతిక పురోగతి వుంటుంది.

Post a Comment

0 Comments